
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు బిల్ గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశను అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన చారిత్రాత్మకమని, ప్రజల సాధికారతకు దోహదపడుతుందని తెలిపారు.
సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం రాష్ట్ర అభివృద్ధి దిశగా అమలు చేస్తున్న “స్వర్ణాంధ్ర-2047” విజన్‌ను గేట్స్‌కు వివరించారు. జీరో పావర్టీ, సంపూర్ణ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, అగ్రిటెక్, డీప్ టెక్, స్వచ్ఛాంధ్ర వంటి పది సూత్రాలతో రాష్ట్రాన్ని 2047 నాటికి నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వెల్లడించారు.
టెక్నాలజీ–ఏఐపై దృష్టి ;
రాష్ట్రంలో 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐ వినియోగం కొనసాగుతోందని సీఎం తెలిపారు. 98 ఏఐ యూజ్‌కేసులు, 43 హ్యాకథాన్లు, 7 డేటా లేక్ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని వివరించారు. అమరావతిని క్వాంటం వ్యాలీగా, విశాఖను డేటా-ఏఐ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.
ఆరోగ్యం, విద్య, వ్యవసాయానికి ప్రాధాన్యం;
ఆరోగ్యరంగంలో ‘సంజీవని’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఇప్పటివరకు లక్షలాది మందికి ఆరోగ్య స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపారు. విద్యారంగంలో లిటరసీ-న్యూమరసీపై ప్రత్యేక దృష్టి పెట్టి టెక్నాలజీ ఆధారిత బోధన పద్ధతులు అమలు చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయంలో ఏఐ ఆధారిత సలహాలు, డ్రోన్ సేవలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు రైతులకు అందిస్తున్నామని వెల్లడించారు.
గేట్స్ ప్రశంసలు
సమావేశంలో మాట్లాడిన Bill Gates, భారత డిజిటల్ విప్లవానికి బలమైన పునాదులు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ముందుచూపు కలిగిన నాయకుడని అభినందించారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగం అభినందనీయమని చెప్పారు.
2047 లక్ష్యాలు
ప్రస్తుతం 180 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా పెంచడం, తలసరి ఆదాయాన్ని 42,000 డాలర్లకు చేర్చడం, నిరుద్యోగిత తగ్గించడం, అక్షరాస్యతను 100% చేయడం వంటి కీలక లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది.
రాష్ట్ర అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలకమని, టెక్నాలజీ ఆధారిత పరిపాలనతో స్వర్ణాంధ్ర-2047 సాధ్యమవుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.