
అమరావతి : ఏపీ హస్త కళలకు అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు సాధించినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సింగపూర్ భారత హై కమిషన్ కార్యాలయంలో సోమవారం జరగబోయే రిప్లబిక్ వేడుకల్లో అతిథులకు ఏపీ హస్త కళారూపాలతో కూడిన గిఫ్ట్ బాక్స్ లు అందజేయనున్నారన్నారు. ఇందుకోసం సింగపూర్ భారత హై కమిషన్ లేపాక్షి అధికారులకు 400 గిఫ్ట్ బాక్స్ లకు ఆర్డర్ పెట్టినట్లు వెల్లడించారు. అంతర్జాతీయంగా ఏపీ హస్త కళలకున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని విదేశాల్లో లేపాక్షి షో రూమ్ లు తెరవనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ హస్త కళల శకటానికి తృతీయ స్థానం వచ్చిన నాటి నుంచి హస్త కళా రూపాలకు విపరీతమైన ప్రాచుర్యం లభించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఏపీ హస్త కళారూపాల విక్రయాలు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ లో ఉన్న భారత ఎంబాసీ అధికారులు ఏపీ హస్త కళారూపాలతో కూడిన 400 గిఫ్ట్ బాక్సుల కావాలని లేపాక్షికి ఆర్డరిచ్చారన్నారు. ఈ గిఫ్ట్ బాక్స్ లో సీతాదేవి లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు కోస్టర్ వంటి కళారూపాలు ఉంటాయన్నారు. ఏపీ హస్త కళలకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు.
విదేశాల్లోనూ లేపాక్షి షో రూమ్ లు
రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో 19 లేపాక్షి షో రూమ్ లు ఉన్నాయని మంత్రి సవిత తెలిపారు. ఏపీ హస్త కళలకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడంతో, విదేశాల్లోనూ లేపాక్షి షో రూమ్ ల ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందన్నారు. హస్త కళాకారులకు ఆర్థిక భరోసా కలిగించేలా మార్కెటింగ్ పెంచాలని నిర్ణయించామన్నారు. దీనిలో భాగంగా మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా కళారూపాల తయారీలో కళాకారులకు శిక్షణ అందజేస్తున్నామన్నారు. నిత్యావసరాలు, వస్త్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల మాదిరిగా హస్త కళారూపాలనూ ఆన్ లైన్ లో విక్రయించేలా ప్రత్యేక వెబ్ సైట్ తయారు చేస్తున్నామన్నారు. ఆయా కళారూపాలను 10, 20, 30 శాతం డిస్కౌంట్లతో లేపాక్షి షో రూమ్ ల్లో అమ్మకాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా లేపాక్షి షో రూమ్ లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.వినియోగదారులను ఆకట్టుకునేలా ఆ నిర్మాణాలు ఉంటాయన్నారు. మొదటి విడతలో విశాఖపట్నం, అనంతపురం, కడప లేపాక్షి షో రూమ్ లను అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో షో రూమ్ కు రూ.15 లక్షల చొప్పున వెచ్చిస్తోందన్నారు. ఇప్పటికే ఢిల్లీలోని లేపాక్షి షో రూమ్ అభివృద్ధి చేశామన్నారు. మిగిలిన 15 షో రూమ్ లను విడతల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు హస్త కళలు ప్రతి రూపాలన్నారు. ఆ కళలను పరిరక్షించుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత ఆ ప్రకటనలో తెలిపారు.