
ఏపి ప్రభుత్వంతో సింగపూర్ ప్రభుత్వానికి మధ్య సన్నిహిత సంబంధాలను పునరుద్ధరించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు తాజా రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. జగన్ చేసిన నిర్వాకం వల్ల సింగపూర్ ప్రభుత్వం భయపడిపోయిందన్నారు. సింగపూర్ మంత్రులను సైతం వైఎస్సార్సీపీ బెదిరించిందని మండిపడ్డారు.
ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు పధకం ప్రారంభించనున్న నేపధ్యంలో మంత్రులు అందరు పాల్గొనాలని అదేశించారు. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనకు సియం స్పందించారు. బార్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిన నేపధ్యంలో కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాప్‌లలో బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు.
రాష్ట్రంలో కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని, గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు మన మీద పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీటిపై మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందరు తమ సబ్జెక్ట్‌లు మీద బాగా స్టడీ చేస్తూ వారు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలన్నారు.
చేనేత కుటుంబాలకు లబ్ది చేకూర్చాల్సిన అవసరం ఉందన్న సియం , జాతీయ చేనేత దినోత్సవం రోజున వారికి అదనపు లబ్ది చేకూరేలా ప్రకటన ఉంటుందని అన్నారు. నేతలు ఫోటోలు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు ఎవరు పడితే వాళ్లొచ్చి ఫోటోలు అడిగితే ఆచితూచి దిగాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి సానుకూలత ఉందని, పనితీరు బాగలేకపోతే సానుకూలత తగ్గే ప్రమాదం ఉందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో ఆయా శాఖల ప్రగతిపై కాసేపు మాట్లాడిస్తానని తెలిపారు. జనసేన, బీజేపీ నాయకులతోనూ సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయి లోపాలు సరిదిద్దుకోవాలన్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ నెలలో ఉన్న సెలవు దినాలు, పని దినాల వివరాలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నెలాఖరులో 5 పని దినాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించవచ్చని లేదంటే సెప్టెంబర్ మొదటి వారం సమావేశాలకు అనుకూలమని మంత్రివర్గం భావించింది.