అవినీతి అధికారికి అందలం…! వైద్య ఆరోగ్య శాఖలో అంతా నా ఇష్టం !

వైద్య ఆరోగ్యశాఖ లో ఓ అవినీతి అధికారిని అందలమెక్కించేందుకు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వం హయాంలో వందల కోట్ల అవినీతి పాల్పడిన ఆ అధికారిని ఏకంగా కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ గా రికమండ్ చేయటం ప్రస్తుతం ఆశాఖలో కలకలం రేపుతుంది. గత ప్రభుత్వ హయాంలో వైద్యఆరోగ్య శాఖను అన్నీతానై నడిపించిన ఓ సీనియర్ ఐఎస్ ఎస్ అధికారికి ఈయన గారు నమ్మిన బంటు కావటమే కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ జాబితాలో చోటుదక్కటానికి ప్రధాన కారణమన్న చర్చ సాగుతుంది. నీతి, నిజాయితీ కలిగిన అధికారులను కాదని అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తిని కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ గా పదోన్నతి కల్పించాలనుకోవటంపై పలువురు పెదవి విరుస్తున్నారు.

అవినీతి చరిత్రే ఇతని గుర్తింపు..!

ఇతగాని చరిత్ర గురించి చెప్పాలంటే చాటభారతమంత ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికే బ్రాండ్ అంబాసిడర్ గా పేరు గాంచిన ఇతని అవినీతి కహానీలు అన్నీ ఇన్నీ కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేషీలో పిఎస్ గా పనిచేసిన సమయంలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడు. అదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆస్ధులు కూడబెట్టాడన్న ఆరోపణలు రావటంతో విశాఖ ఏసీబీ అధికారులు దర్యాప్తుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో హైద్రాబాద్ ఏసీబీ అధికారులు సైతం అదాయానికి మించిన ఆస్ధుల వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగటంతో అటు హైద్రాబాద్, విశాఖ ఏసీబీ అధికారుల మధ్య ఈ కేసు టేకప్ చేసే విషయంలో కొద్దిరోజుల పాటు వాదన కూడ నడిచి,… చివరకు హైద్రాబాద్ ఏసీబీ అధికారులు సదరు అధికారి అదాయానికి మించి ఆస్తుల కేసును టేకప్ చేశారు.

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదాయానికి మించి ఆస్ధుల కేసును కొందరు పెద్దల అండతో ఏసీబీ ప్రాసిక్యూషన్ నుండి డిపార్టమెంటల్ ఎంక్వయిరీకి మార్పించుకున్నాడు. అయితే తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత డిపార్టమెంటల్ ఎంక్వయిరీస్ నుండి తిరిగి ఆ కేసు దర్యాప్తును ఏసీబీకి అప్పగించారు. చివరకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏసీబీ నుండి ఆకేసును కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కు తెప్పించుకుని నాట్ ప్రూడ్ క్రింద క్లీన్ చిట్ పొందాడు. ఇందుకు గాను పెద్ద మొత్తంలోనే ముడుపులు ముట్టచెప్పాడన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి.

సస్పెన్షన్..మళ్ళీ.. రీ ఎంట్రీ..!

2014 నుండి 2019 కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ ఉన్నారు. 108,104 టెండర్ల వ్యవహారంలో గోల్ మాల్ కి చోటు చేసుకోవటంతో దాని వెనుక ఇతని హస్తం ఉందని నిర్ధార్ణకు వచ్చి ఏకంగా సస్పెన్షన్ వేటు వేశారు. రెండేళ్ళ కాలం ఇతని పై సస్పెన్షన్ కొనసాగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి అండదండలతో సస్పెన్షన్ ను ఎత్తివేయించుకోవటతోపాటు, పెండింగ్ ఛార్జెస్ ను రిమూవ్ చేయించుకుని తిరిగి కీలకమైన పోస్టింగ్ తెచ్చుకున్నాడన్న ప్రచారం జరిగింది.. ఇందుకుగాను మూడు కోట్ల రూపాయల ముడుపులు ముట్ట చెప్పాడన్న వార్తలు అప్పట్లోనే ఆశాఖలో గుప్పుమన్నాయి.

కోవిడ్ నిధుల దుర్వినియోగం…వందల కోట్ల స్కామ్..!

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇతను ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచింది. కోవిడ్ సమయంలో 1800 కోట్ల రూపాయలు కోవిడ్ కోసం విడుదల చేయగా వందల కోట్లు కొల్లగొట్టాడన్న ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఆసుపత్రిలో భోజనాలు పెట్టించే కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని జవహర్ రెడ్డి కనుసన్నల్లో సుమారు గా 200 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అన్న ఫిర్యాదులు రావటంతో కొద్ది రోజులు ఉన్నతాధికారులు ఇతడిని పక్కన పెట్టారు. అయితే పైరవీలు చేయటంతో దిట్టకావటంతో అనతి కాలంలోనే తిరిగి కీలకమైన బాధ్యతలను చేపట్టి శానిటేషన్ సెంట్రలైజేషన్, ప్రొక్యూర్మెంట్ సెంట్రలైజేషన్, సెక్యూరిటీ సెంట్రలైజేషన్ ను తెరలేపి తన మాట వినే వ్యక్తులను తన క్రింది స్థాయి పోస్టుల్లోకి తెచ్చుకోవటం ద్వారా తన అవినీతి సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. ఇతని అవినీతిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో పలువురు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.

మంత్రిని సైతం భ్రష్టుపట్టించే స్థాయికి…!

మొన్నటి ట్రాన్స్ఫర్ల వ్యవహారంలో వసూళ్లలో ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే అవినీతి మకిలి అంటించే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు ఇతనిపై వెల్లువెత్తాయి. దీంతో మంత్రి సైతం ఇతనిపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. 13 ఏళ్లుగా కీలకమైన ఫోకల్ పోస్టుల్లో కొనసాగుతున్న ఇతడిని వెంటనే నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేయాలని మంత్రి అదేశాలు ఇచ్చినా ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి అండదండలతో తిరిగి కీలకమైన ఫోకల్ పోస్టులనే కొనసాగుతూ మంత్రికే ఛాలెంజ్ విసరటం వైద్యఆరోగ్యశాఖలో హాట్ టాపిక్ గా మారింది.

Confirmed IAS జాబితాలో చోటు..!

మరి ఇంతటి అవినీతి ఘనాపాటిని ప్రస్తుతం కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ గా రికమండ్ చేస్తూ జాబితాలో చోటు ఇవ్వటం అంటే కూటమి ప్రభుత్వం లో కూడా ఇలాంటి వారి ఆటలు ఏవిధంగా సాగుతున్నాయోనన్న ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. రేపో, మాపో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ పదోన్నతుల జాబితాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సన్నద్ధం అవుతుంది. ఈ తరుణంలో ఆ జాబితాను మరోసారి పూర్తిస్ధాయిలో వెరిఫై చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇతగాడి మాదిరిగానే ఇంకెతమంది ఆ జాబితాలో ఉన్నారో అన్న చర్చసాగుతుంది. ఈ తుదిదశలోనైనా కూటమి ప్రభుత్వం తక్షణమే ఇతనిపై పూర్తిస్ధాయిలో దర్యాప్తు జరపాలని కోరుతున్నారు.

×