
Last Warning to Maoists : రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. పలువురు మావోయిస్టులు శనివారం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రామకృష్ణ, అరుణ ఉన్నారు. అదే క్రమంలో ఏవోబీ పరిధిలో భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. డంపు ల నుండి ఏకే 47, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
లొంగిపోయిన వారిలో తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్‌ఛార్జి, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు జోరిగే నాగరాజు అలియాస్ కమలేష్, అతని భార్య తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ మొబైల్ అకడమిక్ పొలికటల్ ఆర్గనైజేషన్ స్కూల్ ఇన్‌ఛార్జి మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఉన్నారు. కమలేష్ మావోయిస్టు పార్టీలో సుమారు 34 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన వీరిద్దరూ మావోయిస్టు పార్టీ వైఫల్యాలు, కేంద్ర కమిటీ విధానాలకు విసుగు చెందిలొంగిపోయినట్లు తెలిపారు.

డీజీపీ ఎదుట లొంగిపోయిన ఉభయ కృష్ణా జిల్లాకు చెందిన నాగరాజు అలియాస్ కమలేష్ దంపతులకు ప్రభుత్వం ప్రకటించిన పునరావాస చెక్కులను అందజేశారు. వీరితో పాటు మరో 11మంది లొంగిపోయిన మావోయిస్టులకు చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 21 మంది ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పని చేస్తున్నారని చెప్పారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపి హరీష్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు.
వచ్చే ఏడు నెలల్లో మావోయిస్టులు అజ్ఞాతం విడిచి జనజీవనంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీని అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి తర్వాత మావోయిస్టులపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన తరుణంలో డీజీపీ మాయిస్టులను జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునివ్వటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత వారంలో ఆపరేషన్ బృందాలు స్వాధీనం చేసుకున్న మావోయిస్టు డంప్‌ను మీడియా ఎదుట ప్రదర్శించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్ లో ఒక ఏకే 47, హ్యాండ్ గ్రనేడ్లు, ఐదు సెల్ఫ్‌లోడింగ్ రైఫిళ్లు, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఐదు 303 రైఫిళ్లు, ఒక పిస్తోలు, రెండు తపంచాలు, 16 బీజీఎల్ షెల్స్, 20 బీజీఎల్ కాట్రిడ్జులు, 15 డిటోనేటర్లు, ఎనిమిది వాకీటాకీలు, 26 మ్యాగజైన్లు, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి, పేలుడు కోసం వినియోగించే 37 కేజీల కార్డక్స్ వైరు, ఒక టెలీస్కోప్ మావోయిస్టు డంప్‌లో స్వాధీనం చేసుకున్నారు.