
Corrupt Tahsildar : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని ఓ మండల తాహశీల్దార్ అవినీతి లంచగొండి వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియేటర్లతో పనిలేకుండానే డైరెక్టుగా సారే.. డీల్ కుదుర్చుకుంటాడు. ఆపార్టీ, ఈ పార్టీ అని లేదు ఏపార్టీ వారైనా డబ్బు ముట్టచెబితే చాలు…మీ పనైపోయినట్లే…
డబ్బులు ఇవ్వలేని వారు మాత్రం తమ పనుల కోసం చెప్పులు అరిగిపోయేలా తిరిగినా,…బ్రతిమాలినా ఏమాత్రం ‘కరుణ‘ చూపడు…చిన్నా చితక పనులు చేసేందుకు కూడా నోరుపట్టనట్టు అడుగుతుండటంతో మండల ప్రజలు ఇతని పై గరంగరంగా ఉన్నారు. ఇతని మనీ మైండ్ ను గమనించిన కొందరు అక్రమార్కులు మాత్రం ఇదే సరైన సమయమని తమ పెండింగ్ పనులన్నీంటిని అయ్య గారి చేతిలో క్యాష్ కొట్టి మరీ చకచక చేయించేసుకుంటున్నారు.
ఎవరైనా చేయి తడపాల్సిందే ;
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే కనీసం ఆపార్టీకి సంబంధించిన వారికైనా అవినీతిలో కాస్త మినహాయింపు ఇస్తాడా అంటే అదీలేదు. ప్రస్తుతం కూటమి పార్టీ నేతలు చాలా మంది ఇతని వ్యవహారాన్ని తేల్చేందుకు స్ధానిక ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సదరు అధికారి మాత్రం నేను తీసుకుంటున్న మొత్తంలో బాస్ కూడా వాటా ఇస్తున్నానంటూ అడిగినవాడికి, అడగని వాడికి చెప్తుండటంతో కూటమి పార్టీనేతలే తలలుబాదు కుంటున్నారు. అవు చేలో మేస్తే…దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ఇతగాడి వ్యవహారంపై స్ధానిక కూటమి కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు.
తహసీల్దార్ కార్యాలయాలనికి వివిధ పనుల కోసం వచ్చి వెళ్ళే వారి నుండి క్రిందిస్ధాయి సిబ్బందికి గతంలో టీ ఖర్చులకన్నా పైసలు వచ్చేవి. ప్రస్తుతం అన్నీ డైరెక్టుగా అయ్యగారే పుచ్చుకుంటుండటంతో వారి పరిస్ధితి కక్కలేక మింగలేక ఉంది. ఇప్పటికే అయ్యగారి అవినీతి వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఇతడిని బదిలీ చేసి డిప్యూటేషన్ పై కలెక్టర్ కార్యాలయం లో పనిచేస్తున్న ఓ మహిళా అధికారిణిని ఇక్కడకు తీసుకురానున్నారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జోరుగా సాగుతుంది. అయినా ఏమాత్రం కూడా ఆదిశగా అడుగులు పడుతున్న దాఖలాలు కనిపించటంలేదు. ఏప్పుడు ఇక్కడి నుండి సీటు వదిలి వెళ్ళాల్సి వస్తుందోనని ఏపనిని వదిలిపెట్టకుండా చిలకొట్టుడుతో బాగా బిజీ అయిపోయాడు.
అదాయానికి మించి కూడ బెట్టేశాడు ;
గత వైసీపీ పాలనలో కూడా మరో నియోజకవర్గంలో మండలానికి తహశీల్దార్ గా పనిచేస్తున్న సందర్భంలోను ఇతనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. జగన్న కాలనీల్లో అన్ని పనుల్లో బాగా దండుకున్నాడన్న ప్రచారం అప్పట్లోనే బాగా నడిచింది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్న ఈ అధికారి అందివచ్చిన ఏఅవకాశాన్ని మిస్ చేసుకోకుండా గత ప్రభుత్వ పాలనలో బాగా వెనుకేసుకున్నాడని టాక్…బినామీ పేర్లతో పలు చోట్ల ప్రాపర్టీస్ కొనేయటంతోపాటు, వివిధ రూపాల్లో దోచిన సొమ్మును దాచినట్లు చర్చసాగుతుంది.
మరీ ఇంతగా అవినీతికి పాల్పడే అధికారిని తెలిసి మరీ పత్తిపాడు నియోజకవర్గానికి ఎందుకు, ఎవరు తీసుకువచ్చారో అర్ధం కావటంలేదు. తక్షణమే ఈ అవినీతి అధికారిని బదిలీ చేయకుంటే రేపోమాపో ఎసిబికి ఫిర్యాదు చేసేందుకు స్ధానిక కూటమి నేతలు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తుంది.