
AP Nominated Posts 2025 : ఏపి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తూ మూడు పార్టీల క్యాడర్ లో జోష్ నింపుతుంది. తాజాగా 66 వ్యవసాయ మార్కెట్ (Agricultural market)కమిటీల జాబితాను విడుదల చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో మార్కెట్ యార్డు కమిటి ఛైర్మన్ల నియామక జాబితాలను విడుదల చేశారు. మొదటి విడతలో 47, రెండో జాబితాలో 38 కమిటీలకు ఛైర్మన్లను , మూడో జాబితాలో 30, నాలుగో జాబితాలో 66 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రకటన చేశారు. ఏపీలో మొత్తం 218 మార్కెట్ కమిటీలు ఉండగా 4 విడతల్లో కలిపి 181 మందిని భర్తీ చేసినట్లైంది.
ప్రస్తుతం ప్రకటించిన 66 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో జనసేనకు 9, బీజేపీకి 4 పదవులు ఛైర్మన్ పదవులు కేటాయించారు. కులాల వారిగా తీసుకుంటే 17 బీసీలకు, 10 ఎస్సీ సామాజిక వర్గాలకు అలాగే 5 ఎస్టీలకు, 5 మైనార్టీలకు అవకాశం కల్పించారు. గతంలో ఎన్నడు లేని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవుల్లో ఏకంగా 35 మంది మహిళలకు అవకాశం వచ్చింది.
పదవుల భర్తీ విషయంలో ఆచితూచి అడుగులు వేశారు. ఐవీఆర్ఎస్, ఆన్లైన్ సర్వే, పార్టీ నేతల అభిప్రాయాలతో సహా వివిధ మార్గాల్లో పార్టీ కోసం పనిచేసిన నేతల వివరాలు సేకరించి, పార్టీ శ్రేణుల మనోభావాలను తెలుసుకుని పదవులను భర్తీ చేశారు. కూటమి భాగస్వామ్య పార్టీల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా జనసేన, బీజేపీలకు ప్రాధాన్యం కల్పించారు.
మరోవైపు మత్స్యకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా కొల్లు పెద్దిరాజు నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎస్. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.