మద్యం కుంభకోణం డబ్బుతో సినిమాలు తీశారు!

AP Liquor Scam Money: ఏపి మద్యం కుంభకోణం విచారణలో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమంగా వచ్చిన సొమ్మును వైట్లోకి మార్చుకునేందుకు వైఎస్సార్సీ నేతులు ఏకంగా సినిమాలు తీశారు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డి తెలివిగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. హీరో సుమంత్ ను పెట్టి ‘మళ్లీ మొదలైంది’, అలాగే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ‘స్పై’ చిత్రాలను నిర్మించి ఈ రెండు సినిమాల నిర్మాణానికి 40 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారు. ఇదే విషయం సిట్ దర్యాప్తులో నిర్ధారణ అయింది. అయితే ఈ రెండు సినిమాలు తీసేందుకు తమకు రూ.12 కోట్లే ఖర్చు అయినట్లు, దీనిని కూడా అప్పు తీసుకొని వచ్చి ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. దొంగ లెక్కలను చూపించినట్లు దర్యాప్తులో సిట్ నిర్ధారణకు వచ్చింది.

మద్యం సరఫరా చేసే డిస్టిలరీలు, తయారీ సంస్థల నుంచి నగదు రూపంలో తీసుకున్న ముడుపుల మొత్తాన్ని రాజ్ కెసిరెడ్డి నేతృత్వంలోని ముఠా ముందు ఒకరి వద్ద ఉంచారు. ఆతర్వాత ఆ డబ్బును అతని నుండి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి మళ్ళించింది. ఈ సొమ్ము అప్పుగా తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించారు. ఓ సినీ నటుడి భార్య కూడా కోటి రూపాయల వరకూ ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ ఖాతాకు బదిలీ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఆమెకు ఆడబ్బును తిరిగి చెల్లించలేదని సిట్ పరిశీలనలో వెల్లడైంది. ఆ 12 కోట్ల రూపాయలు కాకుండా మిగతా 28 కోట్ల రూపాయలు నగదు రూపంలో సినిమాల నిర్మాణం కోసం ఖర్చుచేసినట్లు సిట్ తేల్చింది.

లెక్కలు చూపని డబ్బు రూ.40 కోట్ల ఖర్చు

వైసీపీ మద్యం ముఠా తీసిన రెండు చిత్రాలైన మళ్లీ మొదలైంది’, ‘స్పై’ చిత్రాలను ఎంత బడ్జెట్లో నిర్మించారో రికార్డుల్లో చూపించినప్పటికీ ఏచిత్రానికి ఎంత మొత్తంలో ఖర్చు చేశారు , ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. ఎవరు ఆసొమ్మును ఇచ్చారు. చిత్రాలు రిలీజ్ అయిన తరువాత ఎంత కలెక్షన్లు వచ్చాయి అనేది సిట్ దర్యాప్తులో వివరాలను సేకరించింది. ఇప్పటికే ఈడీ ఎంటర్టైన్‌మెంట్స్ కు సీఈవోగా వ్యవహరించిన ఉప్పలపాటి చరణ్ తేజ్‌ను సిట్ ప్రశ్నించి అతడి నుండి వివరాలు రాబట్టింది. ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీ, ఇతర హక్కులను 36 కోట్లకు విక్రయించినట్లు విచారణలో చరణ్ తేజ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. మొత్తంగా 40 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఈ సినిమాల నిర్మాణానికి వెచ్చించి 36 కోట్ల రూపాయలను వైట్ చేసుకున్నారు. ఈ వివరాలను సిట్ త్వరలో కోర్టుకు సమర్పించబోనుంది.

రాజ్ కసిరెడ్డి 2020 డిసెంబరు 12న ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థను నెలకొల్పారు. జగన్‌ అధికారంలో ఉన్నసమయంలోనే ‘మళ్లీ మొదలైంది’ సినిమాను ,స్పై చిత్రాన్ని విడుదల చేశారు. ఈ రెండు కాకుండా మరికొన్ని చిత్రాలను నిర్మించేందుకు డైరెక్టర్లు, రచయితలకూ పెద్దమొత్తంలో అడ్వాన్సులిచ్చారు. పలువురితో సినిమాల నిర్మాణానికి సంప్రదింపులు జరిపారు. ఈలోగా ఎన్నికలు రావడం, జగన్ అధికారం కోల్పోవటం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు స్పీడందుకోవటంతో సినిమాల నిర్మాణం నిలిపివేసి అండర్ గ్రాండ్ కి వెళ్లిపోయారు.

×