ఆసియాలో అత్యంత ఎక్కువ వయస్సుగల ఏనుగుగా భావించబడుతున్న “వత్సలా”, అనే ఏనుగు మృతిచెందింది. 100 ఏళ్లు పైబడిన వయస్సులో మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో ఇది మరణించింది. దీని మరణాన్ని పన్నా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. ఈ ఆడ ఏనుగును కేరళ నుంచి నర్మదాపురం తీసుకువచ్చారు. అక్కడి నుండి దానిని పన్నా టైగర్ రిజర్వ్‌కు తరలించారు.

Asia’s Oldest Elephant : వత్సలా (Vatsala) ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా భావిస్తున్నారు. ఏనుగు అంత్యక్రియలను పన్నా టైగర్ రిజర్వ్ అధికారులు, ఉద్యోగుల చేతుల మీదుగా నిర్వహించారు.
వత్సలా పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచేది. వయస్సులో పెద్దదిగా ఉన్న వత్సలా, రిజర్వ్‌లోని ఇతర ఏనుగుల బృందానికి నాయకత్వం వహిస్తూ ముందుండి నడిపించేది. ఇతర ఆడ ఏనుగులు పిల్లలను కనిన సందర్బంలో వత్సలా ముత్తాత పాత్ర పోషించేదని అధికారులు చెబుతున్నారు.
చనిపోవటానికి కొద్ధి సమయం ముందు హినౌటా ప్రాంతంలోని ఖైరయ్యాన్ వాగు వద్ద, కాళ్ల గాయాల కారణంగా వత్సలా కూర్చుని ఉండటాన్ని అధికారులు గమనించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది వత్సలను లేపడానికి అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఫలితంలేకుండా పోయింది. ఆకొద్ది సేపటికే మరణించింది.

వయోజన భారం కారణంగా వత్సలా కంటి చూపును సైతం కోల్పోయింది. దీంతో ఎక్కువ దూరం నడవలేకపోయింది. దీనిని హినౌటా ఏనుగుల శిబిరంలో ఉంచారు. ప్రతిరోజూ ఖైరయ్యాన్ వాగుకు స్నానానికి సిబ్బంది తీసుకువెళ్లేవారు. అరుగుదల తక్కువగా ఉంటుందని ప్రతిరోజు జావ మాత్రమే తినిపించేవారు.
వత్సల ఆరోగ్యాన్ని పన్నా జిల్లాలోని టైగర్ రిజర్వ్‌లోని వెటర్నరీ వైద్యులు, వన్యప్రాణి నిపుణులు క్రమం తప్పకుండా నిరంతరం తనిఖీ చేస్తూ ఉండేవారు. తగిన జాగ్రత్తల వల్లే 100 సంవత్సరాలు అదిజీవించగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏనుగులు 60 నుండి 70 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాయి. అయితే వత్సల 100 ఏళ్ళు బ్రతకటం రికార్డుగా చెబుతున్నారు.