
పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా పోలవరం కూడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి వచ్చిన గోదావరి జలాలకు ఇబ్రహీం పట్నం పవిత్ర సంఘమం దగ్గర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గోదావరి నదిలో ప్రతి ఏడాది 3 వేల టీఎంసీ లు నీరు సముద్రంలో వృథాగా కలసిపోతుందని, ఆ వృధా నీటిని పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలోగా ఆ నీటిని కొంతమేర అయినా సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగానే నాడు చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు అని మంత్రి నిమ్మల గుర్తు చేశారు.
రాయలసీమ లో గత సంవత్సరం ఏ రిజర్వాయర్ లో చూసినా 90 నుండి 95 శాతం నీటి సామర్థ్యం తో నీటిని నిల్వ చేయగలిగాం అని ఇది చంద్రబాబు గారి ముందు చూపు ద్వారానే సాధ్యమైందన్నారు. పట్టిసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గత టీడీపీ పాలనలో రాష్ట్రంలో 1040 ఎత్తిపోతల పథకాలు ఉంటే, వీటి ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తే, గత పాలనలో 450 లిఫ్ట్ స్కీం లు మూతపడ్డాయని,ఈ లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరందని దుస్ధితి నెలకొందన్నారు.

వరద ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఒక ఏడాది వర్షం పడి వరదలు వచ్చినా, మరో ఏడాది వర్షాలు పడక పోయినా నిల్వ చేసుకున్న నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. పట్టిసీమ నుండి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా, కృష్ణా నది ఎగువన శ్రీశైలం బ్యాక్ వాటర్ ను రాయలసీమ కు ఉపయోగించుకోవడం జరుగుతోందని తెలిపారు.
గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ లిఫ్ట్ స్కీమ్స్ కి గానీ, లాకులకు, షట్టర్లకు, డోర్లకు గానీ , రిపేర్లు సంగతి పక్కన పెడితే కనీసం గ్రీజు కూడా పెట్టలేదన్నారు. పులిచింతల గేటు కొట్టుకుపోయినా, గుండ్ల కమ్మ గేట్లు కొట్టుకుపోయినా, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 20 గ్రామాలు నీట మునిగిపోయి, 42 మంది చనిపోయునా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అప్పుల ఉబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తోడుగా, మోదీ అండ తో గాడిలోపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఐసీయూ లోకి తీసుకొచ్చి కోలుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ మెరుగైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన తప్పిదాలు, పాపాలు అన్నీకూడా శాపాలుగా వెంటాడుతున్నాయు అని వివరించారు. ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తూ, మెరుగైన పాలన అందిస్తుంటే, గత ఎన్నికల్లో ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్లీ రపా రపా నరుకుతాం అంటూ రోడ్లమీదకు వస్తున్నారని వైసీపీ నేతలపై మంత్రి నిమ్మల మండి పడ్డారు.