
అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే రాజధాని పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ మరో కీలక ప్రాజెక్టును చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటుగా పలువురు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించిన నేపథ్యంలోనే తాజాగా అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ముమ్మరకసరత్తు జరుగుతుంది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆ బాధ్యతను షెలాడియా అనేక కన్సల్టెన్సీ సంస్ధకు అప్పగించింది.
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు భారీ విగ్రహాన్ని అమరావతిలో నీరుకొండపై గ్రామం వద్ద ఉన్న కొండపై భాగంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మునిసిపల్ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి గుజరాత్ పర్యటించి అక్కడ దేశంలో ఏక్కడ లేని విధంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించి వచ్చారు. అమరావతిలో ఇదే తరహాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
తొలి దశలో ఎన్టీఆర్ విగ్రహం తో పాటు ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం , ప్రాథమిక అంచనాల మేరకు 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. నీరుకొండ ఎత్తు 300 అడుగులు కాగా, దీని మీద 100 అడుగుల ఎత్తులో బేస్‌ను ఏర్పాటు చేసి, ఈ బేస్‌లోనే ఎన్టీఆర్ మెమోరియల్ హాల్, ఎన్టీఆర్ మ్యూజియం, ఎన్టీఆర్ జీవిత చరిత్రతో కూడిన కళాఖండాలు, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ బేస్ పై భాగంలో 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ విగ్రహం పాదాల చెంతకు వెళ్ళటానికి వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్ట్ మార్గాలను నెలకొల్పేందుకు వీలుగా ప్లాన్ రెడీ చేస్తున్నారు. విగ్రహ నమూనాలు రూపకల్పనలో టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ సూచనలు పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఇప్పటికే విగ్రహం నిర్మించే ప్రాంతంలో మట్టి పరీక్షలు,ఇతర సర్వేల పనుల్లో SHELADIA(షెలాడియా) కన్సల్టెన్సీ సంస్ధ నిమగ్నమైంది. అదే సమయంలో విగ్రహ నమూనాలు,ఇతర డిజైన్లపై ప్రాథమిక ప్రతిపాదనలు మంత్రి నారాయణకు SHELADIA(షెలాడియా) సంస్థ అందించింది. కనీసం 10 నమూనాలు సిద్ధం చేసి సీఎం చంద్రబాబు చూపించాలని మంత్రి నారాయణ కన్సల్టెన్సీ ప్రతినిధులను అదేశించారు. విగ్రహం నమూనా ఎలా ఉండాలనేది సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ వెల్లడించారు. విగ్రహం నమూనా,చుట్టుపక్కల చేపట్టే నిర్మాణాలపై కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి చర్చించారు.