దక్షిణాయనం పుణ్యకాలం…శుద్ధ ఏకాదశి

ఆషాఢ శుద్ధ ఏకాదశితో దక్షిణాయనం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు ఉండగా వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే పేలాల పండుగా జరుపుకుంటారు. ఈ రోజు నుండి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన పవళిస్తాడు. అందుకే దీనిని శయనైకాదశి అని అంటుంటారు. ఈ ఏడాది ఆదివారం రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిధి కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి పండుగ జరుపుతున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయంమని పండితులు స్పష్టం చేస్తున్నారు.

తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుందని నమ్ముతారు. దేవతలకు రాత్రి సమయంగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహా విష్ణువు తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటాడని స్కాందపురాణంలో పేర్కొనబడింది.

దక్షిణాయన పుణ్యకాలం విశిష్టత ఇదే…

మకర సంక్రాంతి నాటినుండి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం వెళ్ళిపోయి, ఇక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఈ కాలం వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుండి దక్షిణ దిక్కు వైపుకు తన ప్రయాణాన్ని సాగిస్తాడు. ఉత్తరాయణంలో పెద్దగా పండుగలు ఏమీ రావు. అయితే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే మన పెద్దలు ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తుంటారు. ఈ సమయంలో ఉపవాసాలు, పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు దాగి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

విష్ణుమూర్తి పూజలందుకునే తొలి ఏకాదశి

తొలి ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఉదయాన్నే తలంటు స్నానం చేసి శ్రీ లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి , ఆవునేయ్యితో దీపారాధన, పసుపు రంగు పువ్వులతో, తులసి దళాలతో, అక్షింతలతో స్వామిని భక్తితో పూజించాలి. పులిహోర, చక్రపొంగలి, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలు స్వామి వారికి సమర్పించిన తరువాత పిల్లపాపలతో వాటిని తృప్తిగా ఆరగించటం అన్నది అనవాయితీగా వస్తుంది.

×